న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగం, లాక్‌డౌన్ పొడిగింపు పరిణామాలపై మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ట్విటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని స్వాగతించిన చిదంబరం, పేదలు, వలస, రోజువారీ కార్మికుల జీవనోపాధి, మనుగడపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రకటించేముందు ప్రధాని మోదీ పేదల జీవనంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.ఈ సంక్షోభ సమయంలో పేదలకు కనీస నగదు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, అదే మొదటి ప్రాధాన్యతగా వుండాల్సి వుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన మండి పడ్డారు. డబ్బు, ఆహారం ఉన్నా ప్రభుత్వం పేదలకు కేటాయించడంలో సుముఖత చూపలేదు. దీంతో వారి జీవితాలు, మనుగడ లాంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీంతో పేదలు 21+19 రోజులు ఆకలితో అలమటిస్తూ లాక్‌డౌన్ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. నా ప్రియమైన దేశమా శోకించు అని ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని నాల్గవసారి జాతికిచ్చిన సందేశంలో కొత్తగా ఏమీలేదని మాజీ ఆర్థికమంత్రి విమర్శించారు.
పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు